రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ఇంటర్నెట్ వినియోగదారులు, గేమింగ్ ప్రియులకు ఎన్నో సంతోషాలను తెచ్చిపెట్టింది. జియో నుంచి నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇప్పటికే టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ ప్రభంజనం సృష్టించగా త్వరలోనే జియో హోం బ్రాడ్‌బాండ్ స్కీమ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ ద్వారా ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ(ఆల్ట్రా-హై-డెఫినిషన్ టెలివిజన్) సెటాప్ బాక్సులను అందించనున్నట్లు అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. అతి తక్కువ ధరలకే ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. 


ముఖేష్ అంబానీ చేసిన ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సేవలు లాంచ్ కానున్నాయి. జియో తీసుకొస్తున్న సెట్ టాప్ బాక్సులతో టీవీ మాత్రమే కాకుండా టీవీ ద్వారానే గేమింగ్ కూడా ఆడుకునే సదుపాయం అందుబాటులోకి రానుండటం విశేషం.