జియో ప్రైమ్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. ఇంకో ఏడాది ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ.99 రీచార్జ్‌తో గతేడాది ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన పాత కస్టమర్లకు ఆ సభ్యత్వం గడువు రేపు 31వ తేదీతో ముగియనుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ గతేడాది మార్చి నెలలో తీసుకున్న వారికైనా ఆ తర్వాత ఇంకెప్పుడు తీసుకున్న వారికైనా రేపే ప్రైమ్ మెంబర్‌షిప్ చివరి తేదీ కానుంది. దీంతో ఏప్రిల్ 1, 2018 నుంచి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కొనసాగిస్తారా ? ఒకవేళ కొనసాగిస్తే మళ్లీ ఎంత రీచార్జ్ చేయాల్సి వుంటుంది ? ఈసారి కూడా గతేడాది లాగే ప్రైమ్ మెంబర్‌షిప్‌కి ఏడాది కాలపరిమితి ఇస్తారా లేదా అనే సందేహాలు జియో ప్రైమ్ యూజర్స్‌ని వెంటాడుతున్నాయి. అయితే, ఆ సందేహాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ తాజాగా రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు ఈ గుడ్ న్యూస్‌ని వినిపించింది.
ఇప్పటికే ప్రైమ్ మెంబర్‌షిప్‌లో కొనసాగుతున్న వాళ్లు అందరికీ 31 మార్చి 2019 వరకు ఎలాంటి రుసుం లేకుండానే ఆ సభ్యత్వం గడువుని పొడిగిస్తున్నట్టు జియో తన ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్తగా జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలని భావించే వాళ్లు తప్పనిసరిగా రూ.99 రీచార్జ్ కూపన్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుంది అని జియో స్పష్టంచేసింది.
జియో ప్రైమ్ మెంబర్స్ తెలుసుకోవాల్సిన విషయం: ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్‌గా కొనసాగుతున్న వారికి రేపటి తర్వాత కూడా మరో ఏడాది పాటు ఎలాంటి చార్జీలు వర్తించకుండానే ఉచిత ప్రైమ్ సేవలు అందనున్నప్పటికీ.. అందుకోసం మీ మొబైల్‌లోని జియో యాప్‌లో జియో కస్టమర్ కేర్ సిబ్బంది అందించే సూచనలను అనుసరించాల్సి వుంటుంది. ఆ తర్వాత మళ్లీ వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కొనసాగుతుందని సదరు టెలికాం దిగ్గజం పేర్కొంది. కేవలం ప్రైమ్ మెంబర్‌షిప్ సంగతిని పక్కనపెడితే, మిగతా రీచార్జులన్నీ యధావిథిగానే అమలులో వుండనున్నాయి.