కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత; అసలేమిటీ ఆర్టికల్ 35ఏ?
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏను తొలగిస్తారన్న ఊహాగానాలతో కశ్మీర్ లోయలో ఉద్రిక్తత నెలకొంది.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏను తొలగిస్తారన్న ఊహాగానాలతో కశ్మీర్ లోయలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం 35-ఏపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఏర్పాటు వాదులు రెండురోజుల పాటు కశ్మీర్ నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను తొలగించాలని చూస్తుందంటూ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, వేర్పాటువాద సంస్థలు గత రెండు రోజులుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. త్వరలో కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని పలు సంఘాలు సుప్రీంను ఆశ్రయించాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను కల్పించే ఆర్టికల్‌ను తొలగిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయిని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. 35ఏ ఆర్టికల్‌ను తొలగించాలంటూ వి ద సిటిషన్స్ అనే స్వచ్చంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆర్టికల్ 35ఏ ఏమి చెబుతోంది?
కాశ్మీరీలకు ప్రత్యేక హక్కులు ఇచ్చేది ఆర్టికల్ 35ఏ. ఈ ఆర్టికల్ ద్వారా జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు వచ్చాయి. ఇది కాశ్మీర్ శాశ్వత నివాసి (1954 మే 14 కంటే ముందు పుట్టిన/10సంవత్సరాలు రాష్ట్రంలో జీవించిన వ్యక్తి)ని నిర్వచిస్తుంది. ఆర్టికల్ 35-ఏ ప్రకారం ఇతర రాష్ర్టాల పౌరులు కశ్మీర్‌లో ఆస్తులు కొనకూడదు, స్థిర నివాసం ఏర్పరుచుకోకూడదు, పరిశ్రమలు, సంస్థలు స్థాపించకూడదు. కాశ్మీర్ మహిళలు బయటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే వారి శాశ్వత హోదా పోతుంది. ఆమెకు ఆస్తిలో ఎటువంటి హక్కు సంక్రమించదు. కానీ ఇది పురుషులకు వర్తించదు. ఆర్టికల్ 14కు ఇది వ్యతిరేకమని కొందరు వాదిస్తుంటే.. తమ మనుగడను ప్రభావితం చేయకుండా ఉండాలంటే కొనసాగించాల్సిందేనని కాశ్మీరీలు వాదిస్తున్నారు.
అయితే 2002 అక్టోబరులో జమ్మూ కశ్మీర్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది.