జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడు ఉమర్ ఖాలీద్ పై గుర్తు తెలియని వ్యక్తి ఈ రోజు ఉదయం కాల్పులు జరిపారు. కాంస్టిట్యూషన్ క్లబ్ బయట ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఖాలీద్‌ సురక్షితంగానే బయటపడ్డారు. ‘టువార్డ్స్ ఫ్రీడం వితవుట్ ఫియర్’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖాలిద్ కాంస్టిట్యూషన్ క్లబ్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. తెల్ల టీషర్టు ధరించి వచ్చిన ఓ వ్యక్తి ఖాలీద్ పై కాల్పులు జరపగా.. ఖాలీద్ చాకచక్యంతో వ్యవహరించి క్రిందకు వంగడంతో ఆయన తూటా నుండి తప్పించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో జేఎన్‌యూ క్యాంపస్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ఖాలీద్ స్లోగన్స్ చేశారని ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను అలాంటి నినాదాలు ఏమీ చేయలేదని ఖాలీద్ చెప్పారు. తాజాగా ఖాలీద్ పై దాడికి యత్నించిన ఘటనపై జిగ్నేష్ మెవానీ ట్విట్టర్లో స్పందించారు. గౌరీ లంకేష్, కల్బుర్గి మొదలైన వారిని హతమార్చిన వారే.. ఖాలీద్ పై దాడికి ప్రయత్నించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా.. తాజాగా ఖాలీద్ పై కాల్పులు జరిపిన వ్యక్తి తప్పించుకొని పారిపోగా.. స్పాట్‌లో దొరికిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


జేఎన్‌యూ వివాదం జరిగాక.. ఉమర్‌ ఖాలీద్‌ కుటుంబానికి పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ బెదిరింపుల కారణంగా ఉమర్‌ 12 ఏండ్ల చెల్లెలు స్కూలు మానేసే పరిస్థితి వచ్చింది. గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి తనని బెదిరిస్తున్నట్లు కూడా ఉమర్‌ ఖాలీద్‌ గతంలో పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.