సీఆర్పీసీ నిబంధనల ప్రకారం, ఏ నిందితుడికైనా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధిస్తే.. అతనికి సెషన్స్ కోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వగలదు. అయితే అలా బెయిల్‌కి దరఖాస్తు చేసే సమయంలో ఆర్డరు కాపీ ఇవ్వాలి. గురువారం సల్మాన్ ఖాన్‌కి కోర్టు 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సమయాభావం వల్ల నిన్న సల్మాన్ తరఫు లాయర్లు బెయిల్ పిటీషన్ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. శుక్రవారం కూడా ఒకవేళ ఇదే పద్ధతి కొనసాగితే... సల్మాన్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సెషన్స్ కోర్టు బెయిల్ పిటీషన్ తిరస్కరిస్తే..ఆయన హైకోర్టులో అపీలు చేసుకోవచ్చు. కానీ మళ్లీ విచారణకు హాజరయ్యేలోగా ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది


నిన్న జోధపూర్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, 2 నల్లజింకలను వేటాడి చంపినందుకు సల్మాన్‌కి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. 20 సంవత్సరాల నుండీ నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు ఒక్క కొలిక్కి వచ్చినందుకు జీవకారుణ్య సంఘాలు హర్షం ప్రకటించాయి. గురువారం కోర్టు తీర్పు ప్రకటించాక.. సల్మాన్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.



దాదాపు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆ సమయంలో ఆయన సోదరి అల్విరా ఆయనకు పెట్టుకొనేందుకు కళ్లద్దాలు ఇచ్చింది. అలాగే మరో సోదరి అర్పిత కూడా సల్మాన్‌తో పాటు కోర్టుకి వచ్చారు. సల్మాన్ తీర్పు వెలువడ్డాక యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్లు తీసుకున్నారని సమాచారం.


1998 సంవత్సరంలో కంకనీ గ్రామంలోని అటవీ ప్రాంతానికి సల్మాన్ తన తోటి నటీనటులైన సైఫ్ అలీఖాన్, టబు, నీలమ్, సోనాలి బింద్రేతో కలిసి వెళ్లారు. అక్కడే ఆయన రెండు నల్లటి జింకలను వేటాడారు. బుల్లెట్ల శబ్దం విని వచ్చి చూసేసరికి గ్రామస్తులకు చనిపోయిన జింకలు కనిపించాయి. వారికి జిప్సీలో వెళ్లిపోతున్న సల్మాన్ ఖాన్‌తో పాటు మిగతా నటీనటులు కనిపించారు.


నల్లజింకలు అంతరించిపోతున్న జాతి కావున.. సల్మాన్ పై పెట్టిన కేసు తీవ్రరూపం దాల్చింది. ఆయనపై జీవ కారుణ్యసంఘాలు మండిపడ్డాయి. గత 20 సంవత్సరాలుగా ఈ కేసు నత్తనడకన నడుస్తూ వస్తోంది. నిన్న కోర్టుకి వచ్చేముందు.. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌తో కొద్దిసేపు మాట్లాడారు. తీర్పు వెలువడ్డాక, పోలీసులు సల్మాన్‌ను జైలుకి తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. నాలుగు దుప్పట్లు కూడా అందించారు.