జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ప్రమాణస్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర కేంద్ర మంత్రులు, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవెగౌడ, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సీజే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. కాగా జస్టిస్ రంజన్ గొగోయ్ వచ్చే ఏడాది నవంబర్ 17 పదవీవిరమణ చేస్తారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేపథ్యం..


జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌ అసోసియేషన్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన.. గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2001లో గొగోయ్‌ గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011లో అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో జస్టిస్‌ గొగోయ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత సర్వోన్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న తొలి వ్యక్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కావడం గమనార్హం.