తమిళనాట స్టార్ హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన కమల్.. తమిళనాడులోని 32 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామం చొప్పున దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఆయా గ్రామాల దత్తతపై ఫిబ్రవరి 21న మరో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు కమల్ తెలిపారు. తాను దత్తత తీసుకున్న గ్రామాలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని అన్నారు కమల్ హాసన్. ఓ సరికొత్త తమిళనాడుని పునర్మించేందుకు తాను చేస్తోన్న ఈ యాగంలో తన అభిమానులు కూడా భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కమల్ విజ్ఞప్తి చేశారు. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ బాబు స్టైల్లో డబ్బున్న ధనవంతులు ఎవరైనా ఊరి బాగుకోసం పాటుపడితే నిజంగా అది అభినందించదగిన పరిణామమే అవుతుంది.


ఇదిలావుంటే, 'గత కొంత కాలంగా రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తోన్న కమల్ హాసన్ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా అన్ని విధాల సిద్ధంగా వుండటానికి తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ గ్రామాల దత్తత అయి వుండవచ్చు' అని తమిళతంబీలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా కమల్ తాను చేసిన ప్రకటనను ఆచరణలో పెడితే, అప్పుడు నిజంగానే గొప్పోడు అనిపించుకోవడం ఖాయం.