మే 12న శనివారం కర్ణాటక శాసనసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనుండగా మంగళవారం బెంగుళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా ఓటర్ కార్డులు లభ్యమైన నేపథ్యంలో రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గంలో ఎన్నికలను నిలిపేసి, మే 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆర్ఆర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలను మే 31వ తేదీన వెల్లడించనున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మే 12న ఒక్క విడతలో జరగనున్న ఎన్నికల్లో నమోదైన ఓట్లను మే 15వ తేదీన లెక్కించనున్నారు. ఇదే నియోజకవర్గం పరిధిలోని జలహల్లి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో సుమారు 10,000లకు పైగా ఓటర్ ఐడీ కార్డులు లభ్యమైన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఓటర్ ఐడీ కార్డులతోపాటే అదనపు సభ్యుల పేర్లు నమోదు చేసేందుకు ఉపయోగించే ఫామ్ 6 దరఖాస్తు రసీదులు వేల సంఖ్యలో లభించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. భారీ సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డుల గురించి సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న ఫ్లైయింగ్ స్వ్కాడ్ విభాగం అధికారులు.. అక్కడ స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మునిరత్న పేరుపై కనిపించిన పలు కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కర్ణాటకలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) డిమాండ్ చేస్తూ వచ్చాయి.


అయితే, ఓటర్ ఐడీ కార్డులు లభ్యమైన ఇల్లు బీజేపీ నేత మంజుల నంజమారి పేరిట వుండటం, అందులో అద్దెకు వుంటున్న రాకేష్ కూడా ఆమెకు బంధువైన బీజేపీ కార్యకర్తే అయ్యుండటంతో ఈ వ్యవహారం బీజేపీ పనేనని విమర్శించే అవకాశం కాంగ్రెస్‌కి చిక్కినట్టయింది.