బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయమని మాజీ ప్రధాని దేవగౌడ తెలిపారు. తాజా ఎన్నికల సర్వేల్లో జనతాదళ్‌-సెక్యులర్‌ (జేడీఎస్) కింగ్ మేకర్ అవుతుందని వెల్లడి కావడంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మీ పార్టీ కింగ్ మేకర్ అయితే.. మీరు బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? మీరు గతంలో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారుగా? అని అడగగా.. దేవగౌడ పైవిధంగా స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ హయాంలో కర్ణాటక చాలా నష్టపోయిందని దేవెగౌడ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారని ఆయన గుర్తు చేశారు. ఐదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ముఖ్యమంత్రి మారలేదు కాని లోకాయుక్త, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, కార్పొరేషన్‌ దెబ్బ తిన్నాయని అన్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడానికి తాను సాయం చేయాలనుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఇదే వర్తిస్తుందన్నారు. ఈ మేరకు తన నివాసంలో దేవగౌడ మీడియా సమావేశం నిర్వహించారు. సిద్ధరామయ్య, యడ్యురప్ప కంటే తన కుమారుడు కుమారస్వామియే మంచి ప్రత్యామ్నాయం అవుతారని అన్నారు. ఎవరు మెరుగైన పాలన అందించగలరో నిర్ణయించుకోవాల్సింది ప్రజలేనన్నారు.


వివిధ సర్వే సంస్థలు సోమవారం  ఒపీనియన్‌ పోల్స్‌ ను ప్రకటించాయి. అయితే అన్ని  సర్వేలు మాత్రం హంగ్‌ తప్పదని చెప్తున్నాయి. టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ చేసిన సర్వేలో అధికార కాంగ్రెస్‌ పార్టీ 91, బీజేపీ 89 సీట్లలో గెలుస్తుందని చెప్పింది. గత ఎన్నికల మాదిరి ఈసారి కూడా జేడీఎస్ 40 సీట్లు గెలిచి కీలకంగా మారనుంది. ఏబీపీ–సీఎస్‌డీఎస్‌ సర్వే బీజేపీకి 92, కాంగ్రెస్‌కు 88 స్థానాలు వస్తాయని చెప్పింది.  మొత్తం 224 సీట్లలో అధికారం చేజిక్కించుకునేందుకు కనీసం 113 సీట్లు రావాల్సిందే. ఇకపోతే, సీఎం ఎవరైతే బాగుంటుంది అని సీఎస్‌డీఎస్‌ సర్వేలో నిర్వహించగా సిద్దరామయ్యకు 46.15%, యడ్యూరప్పకు 31.76%, కుమారస్వామికి 17.63% మంది మద్దతు పలికారు.