అందరి చూపు మోదీ కోసం సీటు త్యాగం చేసిన కర్ణాటక గవర్నర్ వైపే..!
అందరి చూపు కర్ణాటక గవర్నర్ వైపే..!
అందరి చూపు కర్ణాటక గవర్నర్ వైపే..! అదేంటీ అనుకుంటున్నారా? అవును ప్రభుత్వాన్ని ఏర్పాటులో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారు. ప్రకరణ 164(1) ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రి మండలిని గవర్నర్ నియమిస్తాడు. గవర్నర్ కార్యనిర్వాహక అధికారాల్లో ఇదీ ఒకటి. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత కాగా, గవర్నరు రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు. గవర్నరు పదవి నామకార్థమైనది. భారత రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధిగా గవర్నరు వ్యవహరిస్తారు.
కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం కనిపించడంలేదు కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాపైనే ఉంది. వాజుభాయ్ వాలా పూర్వపు బీజేపీ నేత, ఒకసారి (2002లో) నరేంద్ర మోదీ కోసం సీటు కూడా త్యాగం చేశారు. ఆతరువాత సీఎం మోదీ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
వాలా సంప్రదాయం ఫాలో అయితే, అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు పిలవాలి. కానీ గత కొద్దిరోజులుగా ఈ సంప్రదాయాన్ని ఎవరూ పాటించడం లేదు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను గవర్నర్లు పిలవలేదు. కనుక కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్ర కీలకం కానుంది.
కాంగ్రెస్ నేతలను కలిసేందుకు గవర్నర్ నో
గవర్నర్‌ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లిన కాంగ్రెస్ నేతలను కలిసేందుకు గవర్నర్ నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ నేతలు నిరాశతో వెనుదిరిగారు. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి గవర్నర్‌కు వివరించి కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే వారిని కలవడానికి గవర్నర్ నిరాకరించారు. ఇలా ఉండగా కాంగ్రెస్ తో తమకు ఒప్పందం కుదిరిందని, ఆ పార్టీ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని జేడీఎస్ ప్రకటించింది.
వాజూభాయ్ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రారంభించారు. తరువాత 1971లో జన సంఘ్‌లో చేరారు. 1975లో అత్యవసర పరిస్థితుల్లో ఆయన పదకొండు నెలల జైలుశిక్ష గడిపారు. 1980లో రాజ్కోట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తరువాత ఆయన రాజ్కోట్ నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి 1998 నుంచి 2012 వరకు క్యాబినెట్ మంత్రిగా ఆర్ధిక, రెవెన్యూ శాఖలకు పనిచేశారు. రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. డిసెంబరు 2012లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై ఆగస్టు 2014 వరకు పనిచేశారు. కర్ణాటక గవర్నర్ సెప్టెంబర్ 2014 లో నియమించబడ్డారు