వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన కర్ణాటక సర్కార్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి ఎట్టకేలకు రెండు నెలల తర్వాత రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.49,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కుమారస్వామి.. త్వరలోనే రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై ఆదేశాలు జారీకానున్నట్టు తెలిపారు. అంతేకాకుండా రైతు రుణాల మాఫీని అధికార యంత్రాంగం పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో అతి కీలకమైనది వ్యవసాయ రుణాల మాఫీ. అయితే, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్ అధినేత కుమారస్వామి మాత్రం అధికారం చేపట్టిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏం చేయాలన్నా అందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత ఎంతో అవసరం అని కుండబద్దలు కొట్టినట్లు తేల్చిచెప్పారు. రైతు రుణాల మాఫీపై మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.