అప్పులు చెల్లిస్తా.. రూ.13,600 కోట్ల ఆస్తులు అమ్ముకోనివ్వండి : విజయ్ మాల్యా
ఆ ఆస్తులు అమ్మితే రూ.15,000 కోట్లు వస్తాయి : విజయ్ మాల్యా
బెంగళూరు: వివిధ బ్యాంకులకు సుమారు రూ.9000 కోట్ల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల్లో రూ.13,600 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఈడీ సీజ్ చేసిన ఆ రూ.13,600 కోట్ల ఆస్తులను విడుదల చేస్తే, వాటిని అమ్ముకుని అప్పులు తిరిగి చెల్లిస్తానని, అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కర్ణాటక హై కోర్టులో విజయ్ మాల్యా తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులలో ఆయనను లిక్కర్ బేరాన్‌ని చేసిన యునైటెడ్ బ్రేవరిస్ ఆస్తులే అధికంగా వున్నాయి. ఆ ఆస్తులను విడుదల చేస్తే, న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనే తిరిగి వాటిని అమ్ముకుని అప్పులు చెల్లిస్తానని ప్రస్తుతం లండన్‌లోనే తలదాచుకుంటున్న విజయ్ మాల్యా కర్ణాటక హై కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఈడీ విభాగం జప్తు చేసిన ఆస్తులను న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో వేలం వేస్తే, కనీసం రూ.15,000 కోట్లు వస్తాయని, వాటితో అప్పులు చెల్లించొచ్చని విజయ్ మాల్యా తరపున అతడి న్యాయవాది సజ్జన్ పూవయ్య కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.