కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమం.. 24 గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేమని కావేరీ ఆసుపత్రి ప్రకటన
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని.. 24 గంటలు దాటితే తప్పితే ఏ విషయం కూడా తాము కచ్చితంగా తెలియజేయలేమని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనను విడుదల చేసింది.
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని.. 24 గంటలు దాటితే తప్పితే ఏ విషయం కూడా తాము కచ్చితంగా తెలియజేయలేమని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనను విడుదల చేసింది. "కలైంగర్ డాక్టర్ ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఆయనకు ప్రస్తుతం పూర్తి స్థాయి వైద్య సదుపాయాలను కల్పిస్తూ.. మానిటరింగ్ చేస్తున్నాము. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఇంకా 24 గంటలు దాటితేనే గానీ ఈ విషయం గురించి ఏమీ తెలిపేందుకు వీలులేదు" అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటనలో తెలిపింది.
గత వారం రోజులుగా కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకొనేందుకు వివిధ రాష్ట్రాల నాయకులతో పాటు కేంద్రమంత్రులు కూడా కావేరి ఆసుపత్రికి వచ్చి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌తో పాటు, ఆయన కుమార్తె కనిమొళితో మాట్లాడి పరామర్శించారు. ఈ రోజు ఉదయం కూడా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎస్.తిరునవుక్కసర్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు.
ఈ మధ్యకాలంలో కరుణానిధి ఆరోగ్యం చక్కబడాలని కోరుతూ ఆసుపత్రికి పలువురు నాయకులు వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నటుడు రజనీకాంత్, మక్కల్ మీది మయ్యం అధినేత కమల్ హాసన్, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆసుపత్రికి వచ్చి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కరుణానిధి ఆరోగ్య విషయానికి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.