కశ్మీర్ ఇష్యూ: ట్రంప్ వ్యాఖ్యలతో లోక్ సభలో దుమారం; ప్రధాని రియాక్షన్ పై ఉత్కంఠత
కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ప్రధాని మోడీ నుంచి వివరణ కోరుతున్నారు
జఠిలమైన కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు లోక్ సభలో తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడే స్వయంగా తనని మోదీ మధ్యవర్తిగా ఉండాలని కోరారని చెప్పిన తర్వాత కూడా ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీశారు.
సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్..
ప్రతిపక్షాలు లెవనెత్తిన కశ్మీర్ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని మోడీనే నేరుగా మాట్లాడాలని పట్టుబట్టాయి. అనంతరం కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి కొంత సేపు వాకౌట్ చేశారు.
మోడీ అలా అనలేదు - రాజ్‌నాథ్ వివరణ
ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ వివాదంపై స్పందించారు. కశ్మీర్ అంశం భారత ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి ఏమాత్రం అంగీకరించబోమన్నారు. అసలు ట్రంప్-మోడీ ల మధ్య ఎప్పుడూ మధ్యవర్తిత్వ అంశం చర్చకు రాలేదని వివరణ ఇచ్చారు.
పాక్ ప్రధానితో కలిసి ట్రంప్ ఇలా...
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం వాషింగ్టన్‌లో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జపాన్‌లో జీ-20 సదస్సు సందర్భంగా మోదీ తనను కలిసి.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని కోరారని ప్రకటించారు. అత్యంత జఠిలమైన కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఉభయ దేశాలు కోరితే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమన్నారు.
ప్రధాని రియాక్షన్ పై ఉత్కంఠత
భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న'' కశ్మీర్ మధ్యవర్తిత్వం'' మాట ట్రంప్ నోట ఎందుకు వచ్చిందో ప్రధాని మోడీ స్వయంగా విపక్షాలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కశ్మీర్ విషయంలో ప్రధాని మోడీ మధ్యవర్తిత్వం కోరలేదని... ట్రంప్ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు ఖండిస్తుండగా ...దీనిపై ప్రధాని మోడీ స్వయంగా సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ విషయంలో ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.