ఫెడరల్ ఫ్రంట్‌ను స్వాగతిస్తున్నా: అమిత్ షా
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌ను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌ను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తమ స్నేహితుడే అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలో థర్డ్ ఫ్రంట్‌ని ఏర్పాటు చేయాలని కేసేఆర్ చేస్తున్న ప్రయత్నాలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అలాగే రాజకీయ కూటములుగా కలసికట్టుగా పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉందన్నారు.
గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూటముల ఆధారంగానే ఏర్పడ్డాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై వస్తున్న సర్వేలపై స్పందించిన అమిత్ షా తాము సర్వేలను నమ్మబోమని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యడ్యురప్ప, ఇతర బీజేపీ నేతలపై కేసులు మాత్రమే ఉన్నాయని.. అవినీతి నిరూపణ కాలేదని చెప్పారు. ఇక కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అవినీతి విషయం కర్ణాటక ప్రజలందరికీ తెలుసన్నారు అమిత్ షా.