భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పెద్ద మనసుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సహాయానికిగాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు పినరయి విజయన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. వరదలతో సర్వం నష్టపోయిన కేరళకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నీటిని శుద్ధి చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషిన్లను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషిని ఆదేశించారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగ ప్రముఖులు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఇతరరంగాల వారు ఇతోధిక సాయం అందించడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరదల్లో సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న కేరళ వరద బాధితులకు ఆహారం అందించేందుకు అవసరమైన బియ్యం పంపించాల్సిందిగా కోరుతూ కేరళ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపించాలని సంబంధిత అధికార యంత్రాంగానికి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తిరువనంతపురం వెళ్లారు. రూ. 25 కోట్ల చెక్కు, తన నెల జీతంతోపాటు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నెల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. 


కేరళ వరద బాధితులకు తమ వంతు సహాయంగా తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం సైతం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. టీజీవో సభ్యులు తమ ఒక రోజు వేతనాన్ని కేరళ బాధితులకు విరాళంగా ఇస్తూ రూ.10 కోట్ల చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషికి అందజేశారు.