కేరళ రాష్ట్రానికి భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కేరళలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 26 మంది మృతిచెందారు. మరికొందరు గల్లంతయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విపత్తు నిర్వహణ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం తెల్లవారుజాము నుంచి ఇడుక్కి, మలప్పురం, కన్నూర్‌, వయనాడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడి దాదాపు 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు నదులు, చెరువులు ఉప్పొంగడంతో 26 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇడుక్కి డ్యాం తెరవడంతో పాటు రాష్ట్రంలోని మరో 22 డ్యాంల గేట్లు తెరిచారు. రాష్ట్రంలో మరి కొన్ని డ్యామ్ గేట్లను కూడా తెరిచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.




 


భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణా వ్యవస్థ స్థంభించింది. రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దించి సహాయకచర్యలు చేపట్టినట్లు కేరళ సీఎం పినరాయి విజయన్ వెల్లడించారు. అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది కేరళ సర్కార్.