కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పరమేశ్వర కర్ణాటక డిప్యూటీ సీఎం అవుతారని జనతా దళ్ (సెక్యులర్) నేత బైజు నారజన్ తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీఎస్ ఏర్పాట్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు.. జేడీఎస్ అధినేత హెచ్.డి. కుమార స్వామి ముఖ్యమంత్రి కానుండగా కర్ణాటక పీసీసీ చీఫ్ జి పరమేశ్వర డిప్యూటీ సీఎం అవనున్నట్టు బైజు నారజన్ స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు అనే విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వున్నప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకునే యత్నాల్లో బీజేపీ బిజీగా వుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమర్‌గౌడ లింగనగౌడ పాటిల్ బయ్యపూర్, జేడీఎస్ ఎమ్మెల్యే డానిష్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. తమను బీజేపీలో చేరాల్సిందిగా బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయని అన్నారు. బీజేపీలో చేరితే డబ్బులు, మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభపెట్టారని అమర్‌గౌడ, డానిష్ అలీ మీడియాకు తెలిపారు.


ఈ ఆరోపణల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపేందుకు కానీ లేదా కలిసేందుకు కానీ వీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెంగుళూరులోని ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించినట్టు తెలుస్తోంది.