ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని పలువురు ఆప్ కార్యకర్తలు బహిరంగంగానే తమ అసహనాన్ని వెల్లగక్కడంతో పరిస్థితి వివాదంగా మారింది. బుధవారం రాజ్యసభకు పార్టీ నామినేట్ చేస్తున్న ముగ్గురి పేర్లను డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా ప్రకటించారు. అందులో ఎప్పటి నుండో ఆప్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంజయ్ సింగ్‌తో పాటు వ్యాపారవేత్త సుశీల్ గుప్తా, ఛార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా పేరు కూడా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశీల్ గుప్తా మాజీ కాంగ్రెస్ నాయకుడు. పైగా ఒకప్పుడు ఆప్‌కి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిల్చున్న వ్యక్తి. అలాగే కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు వాణిజ్య ప్రకటనలకు ఖర్చు పెడుతుందని ఆరోపిస్తూ గుప్తా గతంలో ఢిల్లీలో ధర్నాకి దిగి సంతకాలు కూడా సేకరించారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరుకుంటున్నారో ఆప్ కార్యకర్తలకు అర్థం కాక సోషల్ మీడియాలో ఆయనకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశాంత్ భూషణ్‌తో పాటు యోగేంద్ర యాదవ్ కూడా కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా స్పందించారు.


పార్టీకి పనిచేసిన వ్యక్తులకు కాకుండా.. బయట వ్యక్తులకు ఎవరికో సీట్లు కట్టబెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మరో ఆప్ నాయకుడు కుమార్ విశ్వాస్ కూడా బహిరంగంగానే పార్టీపై విరుచుకుపడ్డారు.