కుమారస్వామి ఢిల్లీ పర్యటన; రాహుల్, సోనియాతో భేటీ
జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు.
న్యూఢిల్లీ: జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి సోమవారం ఉదయం బెంగళూరు నుండి ఢిల్లీ బయల్దేరివెళ్లారు. ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కుమారస్వామి తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించడానికి వచ్చారు. యుపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో సమావేశమవుతారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన వారితో చర్చించనున్నారు. అలానే వారిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు.
కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి తన మంత్రివర్గంలో ఇద్దరు డిప్యూటీ సిఎంలను నియమించనున్నారు. లింగాయత్‌లను బుజ్జగించే యత్నంలో ఇద్దరు డిప్యూటీ సిఎంలను నియమించనున్నట్లు సమాచారం. ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఉంటుందని.. కేబినేట్ లో జేడీఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 20 మంత్రి పదవులు దక్కనున్నాయని తెలిసింది. కుమారస్వామి ఒక్కరే బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని కుమారస్వామి వెల్లడించారు. ఆతరువాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పదవీకాలాన్నిపంచుకునే ప్రసక్తే లేదని, ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని కుమారస్వామి చెబుతుండగా.. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
'దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు నేనేమీ మాట్లడలేను. మా ముందు పలు అంశాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు.
అందరూ గురువారం వరకు ఆగాల్సిందే!
ఇదిలా ఉండగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఇంకా హోటల్‌లోనే ఉన్నారు. జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఇళ్లకు వెళ్లరాదని, హోటళ్లలోనే బస చేయాలని గురువారం బల పరీక్ష జరిగే వరకూ వెళ్లనివ్వమని ఆయా పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.
ఇక బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు, బీజేపీయేతర పార్టీ నాయకులు హాజరు కానున్నారు.