ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కుంభమేళాను ఈసారి మరింత వేడుకగా జ‌రిపేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ లేనివిధంగా రూ.1,500 భారీ మొత్తాన్ని కేటాయించింది. ఈ మేరకు ఇవాళ యూపీ సర్కార్ ప్రవేశ పెట్టిన 2018-19 బడ్జెట్‌లో కుంభమేళాకు కేటాయింపులు జరిగాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేశ్ అగర్వాల్ ప్రవేశపెట్టిన మొత్తం రూ.4,28,38,452 కోట్ల బడ్జెట్‌‌లో విద్య‌, ప‌వ‌ర్ సెక్టార్‌ రంగాలకు అధిక మొత్తంలో కేటాయింపులు జరిగాయి.


అలహాబాద్‌లోని పవిత్ర సంగమం వద్ద 2019లో నిర్వహించనున్న కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని అందు కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టిన యూపీ సర్కార్.. అందుకోసం రూ.1500 కోట్ల నిధులు ఇవ్వడం గమనార్హం. 2013లో చివరిసాగి జరిగిన కుంభమేళాకు దాదాపు 10 కోట్ల మంది భ‌క్తులు హాజరైనట్టుగా నివేదికలు చెబుతున్నాయి. 2019లో జరిగే కుంభమేళాకు హాజరయ్యే సంఖ్య 12 కోట్లకు పైగా వుంటుందని అంచనా వేస్తోన్న యూపీ సర్కార్ అందుకు అనుగుణంగా అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.