ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చిన రాహుల్‌ గాంధీ, లాలూ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. దాణా కుంభకోణంలో నేరస్థుడిగా రుజువై జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యం పాలు కావడంతో ఎయిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేరారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



రాహుల్ కలిసి పరామర్శించిన అనంతరం.. ఎయిమ్స్ వర్గాలు లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఆయన ప్రయాణం చేయగల స్థితిలో ఉన్నారని పేర్కొన్నాయి. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే తనను డిశ్చార్జి చేసి రాంచి ఆసుపత్రికి తరలించవద్దని లాలూ కోరారు. ఉద్దేశపూర్వకంగానే తనను రాంచికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎయిమ్స్‌ అధికారులకు లాలూ ఒక లేఖ రాశారు. రాంచీ ఆసుపత్రిలో తన వ్యాధులకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవని లాలూ తన లేఖలో పేర్కొన్నారు.


 



దీనిపై స్పందించిన లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌..ఎయిమ్స్‌ నుంచి రాంచి ఆసుపత్రికి ఎందుకు తరలిస్తున్నారో తెలియదని అన్నారు. ఎయిమ్స్‌ నుంచి మరొకసారి రాంచికి తరలించాలని తీసుకున్న నిర్ణయం తొందరపాటు నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. 'ఎయిమ్స్‌ దేశంలో ఉన్న ఉత్తమ ఆసుపత్రి. అయితే ఎయిమ్స్ తీసుకున్న నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది' అని అన్నారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఎయిమ్స్‌ అధికారులని ప్రశ్నించారు.