దుమ్కా ట్రెజరీ కేసులో లాలూకు ఏడేళ్ల జైలుశిక్ష ఖరారు
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్లు జైలుశిక్ష ఖరారైంది.
రాంచీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్లు జైలుశిక్ష ఖరారైంది. మార్చి 19న ట్రెజరీ కేసులో లాలూను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే..! శనివారం దుమ్కా ట్రెజరీ కేసులో లాలూకు శిక్ష ఖరారు చేస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును చెప్పింది. దాణా కుంభకోణంలో ఇది నాలుగవ కేసు.
డిసెంబర్ 1995 నుంచి 1996 వరకు దుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల నిధులను స్వాహా చేశారు. 1990లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లాలూతో పాటు ఈ దాణా కుంభకోణం కేసులో కనీసం 14 మంది దోషులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు.
ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన మొదటి కేసులో లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఇక రెండవ కేసులో 2017, డిసెంబర్ 23న తీర్పును ఇచ్చింది కోర్టు. ఆ కేసులో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష పడింది. ఇక మూడవ దాణా కేసులో లాలూకు అయిదేళ్ల శిక్ష ఖారారైంది. పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో విచారణ చేపడుతున్నది.