రాహుల్ నుదుటిపై లేజర్ కాంతికిరణం..టార్గెట్ చేశారా ?
ఎన్నికల వేళ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణముప్పు ఉందంటూ ప్రచారం
ఎన్నికల వేళ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణహాని ఉందంటూ ప్రచారం సాగుతోంది. దీనకి కారణం ఇటీవలె ఆయన అమేథిలో పర్యటనలో స్పీచ్ ఇస్తున్న కొన్ని సందర్భాల్లో లేజర్ లైట్ ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్టు వీడియోల్లో కనిపించింది. రాహుల్ నుదుటిని టార్గెట్ చేసుకునే క్రమంలో లేజర్ కాంతి ఆయన ముఖంపై అటూ ఇటూ కదులుతున్నట్టుగా వీడియోల్లో రికార్డయింది. వేర్వేరు సందర్భాల్లో ఇలా 7 సార్లు ఫోకస్ అయినట్టు గుర్తించారు. దీంతో తమ అధినేతకు ప్రాణాహాని ఉందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు
తాజా పరిణామాల నేపథ్యంలో రాహుల్ కు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాహుల్ భద్రతలో లోపాలు ఉన్నాయని తమ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుదుటిపై లేజర్ పాయింట్ పడడాన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించిన వీడియో క్లిప్లింట్ జత పరిచారు. అయితే రాహుల్ నుదుటిపై పడిన లేజర్ కిరణం అక్కడే ఉన్న కెమెరామన్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే రాహుల్ నుదుటిపై పడిన లేజర్ కాంతికిరణం ఓ స్నైపర్ రైఫిల్ నుంచి వచ్చినట్టుగా ఉందని మాజీ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.