నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భీకర దాడులతో అలజడి సృష్టిస్తామని లష్కరే తోయిబా హెచ్చరించింది. అక్టోబర్‌ 20, నవంబర్‌ 9 తేదీల్లో ఉగ్రదాడులతో అలజడి సృష్టిస్తామని లష్కర్‌ ఏరియా కమాండర్‌ మౌల్వి అబు షేక్‌ రావల్పిండి నుంచి హెచ్చరిక లేఖ రాసినట్టు, సెప్టెంబర్ 29న జైపూర్ రైల్వే అధికారులకు ఈ లేఖ అందినట్లు జాతీయ దినపత్రిక తన కథనంలో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్‌ 20న ఎలాంటి విధ్వంసం జరగలేదు కాబట్టి అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ లేఖలో పేర్కొన్న నవంబర్‌ 9న ఎలాంటి అలజడి సృష్టిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఉజ్జయిని మహకాళ్ ఆలయాన్ని (మధ్యప్రదేశ్‌) పేల్చివేస్తామని లష్కరే హెచ్చరించడంతో అధికార యంత్రాగం అలర్ట్ అయ్యింది.


నిఘా, భద్రతా వర్గాలు ఉగ్ర సంస్థ ప్రధానంగా జనసామర్థ్యం ఎక్కువగా ఉన్నచోట, బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్‌లను టార్గెట్ చేసిందనే అనుమానంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌, గ్వాలియర్‌, కట్ని, జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లను టార్గెట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆయా రైల్వే స్టేషన్‌లలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. కాగా రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లష్కరే ఉగ్రదాడుల హెచ్చరికలు చేయడం గమనార్హం.