న్యూఢిల్లీ: 16వ లోక్ సభకు జూన్ 3వ తేదీతో పదివీకాలం ముగియనుండటంతో 17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 543 ఎంపీ స్థానాలకుగాను మొత్తం 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుండగా ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ప్రకటించారు.  


లోక్ సభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా మాట్లాడుతూ.. 99.36 శాతం ఓటర్లకు గుర్తింపు కార్డులు ఉన్నాయని.. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే, 1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌‌కి కాల్‌ చేసి ఓటు హక్కు వివరాలను పరిశీలించుకోవచ్చని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఈవోలతో చర్చించినట్లు చెబుతూ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో శాంతిభద్రతలు, బలగాల మోహరింపుపై సంబంధిత అధికారులతో సమీక్షించినట్టు వెల్లడించారు. రైతులు, విద్యార్థుల పరీక్షలు, పండుగ తేదీలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్ రూపొందించినట్టు సీఈసి తెలిపారు.