రూ.8316 కోట్లు నష్టపోయిన కేరళ: విజయన్
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
కేరళనుభారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం జలదిగ్భందంలో చిక్కుకుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎటు చూసినా వరదలే. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కాగా కేరళలలో వర్షం సృష్టించిన వరద బీభత్సానికి 37 మంతి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
వరదల కారణంగా తమ రాష్ట్రం రూ.8,316 కోట్లు నష్టపోయిందని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు. కేంద్రం మరో రూ. 400 కోట్ల సహాయం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయని, 10వేల కి.మీల రోడ్లు పాడైపోయాయని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యమని..సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
ఫోటో గ్యాలరీ : ఉప్పొంగి ప్రవహిస్తున్న కేరళ నదులు, వరదలు
కేరళకు రూ.100 కోట్ల తక్షణ సాయం
భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. సీఎంతో కలిసి ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. కేరళ పరిస్థితిని కేంద్రం అర్థం చేసుకుందని.. ప్రస్తుత పరిస్థితి నుంచి కేరళ బయటపడటానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అందుకే తక్షణ సాయం కింద కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.