సామాన్యుడికి మరో షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంపు
ఇప్పటికే నిత్యం పెరుగుతూపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి నెత్తి మీద భారంగా పరిణమిస్తుండగా తాజాగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సైతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సబ్సీడీపై ఇచ్చే సిలిండర్ల ధరలను రూ.2.34 పెంచగా, సబ్సీడీయేతర సిలిండర్ల ధరను రూ.48 పెంచుతున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తాజా ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో 14.2 కేజీల సబ్సీడీ సిలిండర్ ధర రూ.493.55 వుండగా, సబ్సీడీయేతర సిలిండర్ ధర రూ.698.50కు చేరుకుంది. అలాగే కోల్‌కతాలో సబ్సీడీ సిలిండర్ ధర రూ.496.65 వుండగా సబ్సీడీయేతర సిలిండర్ ధర 723.50, ముంబైలో సబ్సీడీ సిలిండర్ ధర రూ.491.31 వుండగా సబ్సీడీయేతర సిలిండర్ ధర 671.50, చెన్నైలో సబ్సీడీ సిలిండర్ ధర రూ.481.84 వుండగా సబ్సీడీయేతర సిలిండర్ ధర రూ.712.50కి చేరుకుంది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతీ కుటుంబానికి ఏడాదికి 12 సబ్సీడీ సిలిండర్లు బుక్ చేసుకునే వెసులుబాటు వుంది. ఏడాదికి 12 కన్నా ఎక్కువ సిలిండర్లు వినియోగిస్తే, ఆ తర్వాత బుక్ చేసుకునే సిలిండర్లపై సబ్సీడీ వర్తించదనే సంగతి తెలిసిందే.