రైతులకు రుణ మాఫీ చేస్తామని ఇటీవల మధ్య ప్రదేశ్ సర్కార్ చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలోని రైతులను ఆనందంలో ముంచెత్తింది. అలాగే తాను తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుంది కదా అని ఆశపడిన ఓ రైతు.. అధికారులు వెల్లడించిన రుణ మాఫీ లబ్ధిదారుల జాబితాలో తన పేరిట రూ.13 మాత్రమే మాఫీ అయినట్టుగా ఉండటం చూసి అవాక్కయ్యాడు. మధ్యప్రదేశ్ లోని అగర్ మల్వ జిల్లా నిపనియ బైజ్‌నాథ్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా వున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రామానికి చెందిన శివపాల్ కటారియా అనే రైతు బ్యాంకుకు రూ.20,000 రుణపడి వున్నారు. రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తాం అని కమల్ నాథ్ సర్కార్ ప్రకటించడంతో అందులో తన రుణం కూడా మాఫీ అవుతుందని శివపాల్ ఆశించారు. తీరా బుధవారంనాడు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరిన రుణ మాఫీ పథకం లబ్ధిదారుల జాబితాను పరిశీలించి చూస్తే, అందులో తనకు రూ.13 మాత్రమే రుణ మాఫీ అయినట్టుగా పేర్కొని వుంది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివపాల్.. రైతుల రుణమాఫి పథకంలో తీవ్ర అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై శివపాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.


రైతుకు రూ.13 రుణ మాఫీ అయ్యిందనే వార్తలపై స్పందించిన కేబినెట్ మంత్రి ఓంకార్ సింగ్ మర్కం.. రుణాల పంపిణీ సమయంలో జరిగిన అవకతవకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.