62 ఏళ్లు వచ్చే వరకు.. నో రిటైర్మెంట్ !
ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో ఓ సంచలనమైన నిర్ణయం తీసుకుంది
ఓవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ పే కమిషన్‌తో ముడిపడి వున్న తమ ఫిట్‌మెంట్ కోసం పోరాడుతోంటే, ఈలోపే ఏ పోరాటం లేకుండానే తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వినిపించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అవును, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో ఓ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనేక ఆసక్తికరమైన అంశాలను ప్రకటించారు. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే ఏ ఉద్యోగి కూడా తన అర్హతకు తగిన ప్రమోషన్ పొందకుండా రిటైర్ అవకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్లు సర్వీసులో కొనసాగే అవకాశం రానుండటమే కాకుండా అదృష్టం బాగుంటే ఈలోపే అర్హతకు తగిన ప్రమోషన్ కూడా కొట్టేసే భాగ్యం కలగనుంది. ఏ విధంగా చూసుకున్నా.. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ వరమే కానుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు ఈ బెనిఫిట్ వర్తించనుంది.
ఇదిలావుంటే, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఈ నిర్ణయం తీసుకుని అక్షరాస్యులైన నిరుద్యోగులకు అన్యాయం చేశారని బెరోజ్‌గార్ సేన ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది నిరుద్యోగులకు ఓ శాపంగా మారనుందని, కచ్చితంగా దీనిపై మేము చట్టపరమైన పోరాటం సాగిస్తామని స్పష్టంచేసిన బెరోజ్‌గార్ సేన కార్యకర్తలు.. బీజేపీ సైతం తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటుంది అని అభిప్రాయపడ్డారు.