ఢిల్లీలో జరగాల్సిన బిజేపీయేతర పక్షాల సమావేశం వాయిదా పడిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు తెలిపారు. ఈ నెల 22న ఢిల్లీలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. పార్లమెంట్‌ శీతాకాల  సమావేశాలకు ముందే ఈ సమావేశం నిర్వహించాలని నేతలు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, తేదిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న చంద్రబాబు, మమత బెనర్జీ ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిఎస్పీ అధినేత మాయావతితో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు వారు తెలిపారు. దేశాన్ని పరిరక్షించుకునేందుకే కూటమి సభ్యులంతా కలసి పనిచేస్తున్నారని.. బీజేపీని గద్దె దించడమే తమ ఎజెండా అని ఆమె పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో దేవెగౌడతో కూడా మాట్లాడామని.. ఇంకా అనేక పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని.. నరేంద్ర మోదీ కంటే అనుభవమున్న నాయకులు చాలామంది ఉన్నారని.. మహాకూటమికి అలాంటి వారు వెన్నుదన్నుగా నిలుస్తారని చంద్రబాబు అన్నారు. 


బెంగాల్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి మమత బెనర్టీతో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే బీజేపీయేతర కూటమిపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చజరిగింది. ఈ సందర్భంగా బీజేపీని ఓడించే ప్రణాళికను చంద్రబాబు మమతకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మమత..ఐక్యంగా ముందుకు వెళ్దామని చంద్రబాబుకు తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులను  ఒకే వేదికపై తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మమతతో చంద్రబాబు అన్నారు.