ఉద్యోగులకు షాక్..11,700మందిపై వేటు..!!
![ఉద్యోగులకు షాక్..11,700మందిపై వేటు..!! ఉద్యోగులకు షాక్..11,700మందిపై వేటు..!!](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2018/02/04/166036-504263-govtemployee.jpg?itok=wOsyFcJ_)
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కోటా కింద ఉద్యోగాలు పొందిన 11,700 మంది ఉద్యోగులపై వేటు
మహారాష్ట్రలో తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కోటా కింద ఉద్యోగాలు పొందిన 11,700 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు దేవేంద్ర ఫడ్నావిస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత సంవత్సరం జూలైలో సుప్రీంకోర్టు 'నకిలీ కుల సర్టిఫికేట్ లతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటు కావని.. అలా చేస్తున్న వారు డిగ్రీ, ఉద్యోగం కోల్పోవల్సి వస్తుంది" అని సంచలన తీర్పు చెప్పింది. వారి పదవీకాలంతో సంబంధం లేకుండా వారిపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నకిలీ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని, సాధ్యాసాధ్యాలపై, ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై చర్చలు జరుపుతున్నామని మహారాష్ట్ర సీఎస్ తెలిపారు. క్లర్కులుగా నియమించబడ్డ చాలామంది ఉద్యోగులు పదోన్నతులు పొంది డిప్యూటీ కార్యదర్శి హోదా వరకూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం పలు ఉద్యోగ సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నాయకులతో సీఎస్ మాట్లాడనున్నారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు జరుగనున్న ఈ భేటీ అనంతరం ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.