మహారాష్ట్ర యాంటి టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) బృందం మాజీ చీఫ్ హిమాన్షు రాయ్ శుక్రవారం మధ్యాహ్నం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 1:40 గంటల ప్రాంతంలో హిమాన్షు తన సర్వీస్ రివాల్వర్‌తో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా హిమాన్షు రాయ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే, ప్రస్తుతానికి ఈ ఆత్మహత్య వెనుకున్న కారణాలు ఏంటనే విషయంలో సరైన స్పష్టత లేదు. మహారాష్ట్ర పోలీసు శాఖలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారికి పలు ముఖ్యమైన కేసులు ఛేదించిన సూపర్ కాప్‌ గానూ పేరుంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ అయిన ఆరిఫ్ బెల్‌పై కాల్పుల కేసు, జర్నలిస్ట్ జే డే మర్డర్ కేసు, విజయ్ పలండే హస్తం వున్న డబుల్ మర్డర్ కేసు, లైలా ఖాన్ మర్డర్, పల్లవి పుర్కయాస్త అనే లా గ్రాడ్యూయేట్ మర్డర్ కేసు హిమాన్షు రాయ్ ఛేదించిన మిస్టరీలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2013 ఐపీఎల్ సీజన్‌లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ కేసు హిమాన్షు రాయ్ చివరిగా ఛేదించిన పెద్ద కేసు. ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బుకీలతో సంబంధాలు కలిగి వున్న సినీనటుడు విందూ దారా సింగ్‌ని అరెస్ట్ చేయడంలో హిమాన్షు రాయ్ పాత్ర ఎంతో కీలకం అని మహారాష్ట్ర పోలీసు అధికారవర్గాలు చెబుతుంటాయి. 


> సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి ఉన్నత చదువులు పూర్తి చేసిన హిమాన్షు రాయ్ 1988లో ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. 
> ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ హోదాలో వున్న హిమాన్షు 2016 నుంచి సుదీర్ఘకాలం పాటు సెలవులో వున్నారు.
> దేహదారుఢ్యం కోసం రాయ్ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నట్టుగానూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.