విమానంలో సిబ్బందిపై లైంగిక వేధింపులు.. ప్రయాణికుడి అరెస్ట్
![విమానంలో సిబ్బందిపై లైంగిక వేధింపులు.. ప్రయాణికుడి అరెస్ట్ విమానంలో సిబ్బందిపై లైంగిక వేధింపులు.. ప్రయాణికుడి అరెస్ట్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2018/03/28/168074-672499-vistara-flight-zee.jpg?itok=n7ALO81s)
విమానంలో ఓ మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
విమానంలో ఓ మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. లక్నో నుంచి బయల్దేరి ఢిల్లీలోని ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని 3వ టెర్మినల్లో ల్యాండ్ అయిన ఎయిర్ విస్తారా విమానంలోంచి ప్రయాణికులు కిందికి దిగుతున్న క్రమంలో ఓ ప్రయాణికుడు తమ సిబ్బందిపై లైంగిక వేధింపులకి పాల్పడినట్టుగా ఎయిర్ విస్తారా విమానం మేనేజ్‌మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి24న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎయిర్ విస్తారా ప్రకటించింది. విమానం సిబ్బంది, ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా ఎయిర్ విస్తారా ఇటువంటి ఘటనలను ఎప్పటికీ సహించబోదు అని ఆ సంస్థ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
ఇదిలావుంటే, ఇటీవలే ఇదే ఎయిర్ విస్తారా సంస్థకు చెందిన విమానంలో ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే క్రమంలో తన తోటి ప్రయాణికుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఓ బాలీవుడ్ నటి పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నటి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఎయిర్ విస్తారా ఎయిర్ లైన్స్ సైతం ఆ నటికి సంస్థ తరపున క్షమాపణలు చెప్పుకుంది.