న్యూఢిల్లీ: రైల్వే పట్టాలు దాటడం నేరమని, ముఖ్యంగా రైల్వే స్టేషన్‌లలో పట్టాలు దాటడం మరింత నేరమని హెచ్చరిస్తూ తాటికాయంత అక్షరాలతో నోటీసు బోర్డులు రాసిపెట్టినా.. ఆ హెచ్చరికలను లెక్కచేయకుండా పట్టాలు దాటబోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు, ప్రాణాలపైకి తెచ్చుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అయినా సరే అదే నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తూ అప్పుడప్పుడు కొంతమంది అదే తప్పును చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలోని అసాన్‌గావ్ రైల్వే స్టేషన్‌లోనూ సరిగ్గా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుండగానే అదే సమయంలో ఆ పట్టాలపైకి ఓ  రైలు వేగంగా దూసుకొచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊహించని ఘటనకు ఒక్కసారిగా షాక్ అయిన ఆ వ్యక్తి వెంటనే పట్టాలకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో వున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో సర్దుకుని పడుకున్నాడు. ప్లాట్‌ఫామ్ నుంచి రైలు అంతే వేగంగా వెళ్లిపోయిన అనంతరం లేచి బతుకు జీవుడా అంటూ అక్కడి వెళ్లిపోయాడు. కానీ అతడికేమైందో ఏమోననే కంగారు మాత్రం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులను కాసేపు తీవ్ర ఆందోళనకు గురిచేసింది.