ముంబై: మన్మాడ్-ముంబై పంచవతి ఎక్స్ ప్రెస్‌రైలు మరో 58 కి.మీ ప్రయాణిస్తే, గమ్యం చేరుతుందనగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని థానె జిల్లా కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ 3 బోగీలతో సహా విడిపోయి అలాగే ముందుకు వెళ్లిపోయింది. అయితే, అదృష్టవశాత్తుగా ఈ రైలు ప్రమాదంలో ప్రయాణికులకు ఎవ్వరికీ ఎటువంటి హానీ కలగలేదని సెంట్రల్ రైల్వే ప్రధాన అధికార ప్రతినిథి సునిల్ ఉదాసి తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మన్మాడ్ నుంచి ముంబైకి బయల్దేరిన ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 8:30 గంటలకు కళ్యాణ్‌కు సమీపంలోకి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 


ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించే పలు సబర్బన్, ఇతర రైళ్లకు అంతరాయం ఏర్పడింది. బోగీల నుంచి వేరుపడిన రైలు ఇంజిన్ ఎంత దూరం వెళ్లిందనే విషయంలో సరైన స్పష్టత లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.