మావోయిస్టుల చెరలో విద్యార్ధి ; ఎన్కౌంటర్కు ప్రతీకారమా ?
ఛత్తీస్ గఢ్: సుక్మా జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మావోయిస్టుల అపహరించుకుపోయారు. బెజ్జీ నుంచి కొండాకు వెళ్తుండగా కిడ్నాప్ చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ గురైన విద్యార్ధి కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో సుక్మాజిల్లా అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల ఎన్ కౌంటర్ లో బుధవారం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా ఒక నక్సలైట్ ను సజీవంగా పట్టుకున్నాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఆత్మరక్షణ కోసమే విద్యార్ధిని అపహరించుకు పోయారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ విషయంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు విద్యార్ధి పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.