ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని రాముడితో పోల్చిన ఆయన యూపీ సీఎం ఆదిత్యనాథ్‌‌ని హనుమంతుడితో పోల్చారు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా మారాలని భావిస్తున్న పది పార్టీలను ఆయన రావణుడి పదితలలుగా అభివర్ణించారు.అలాగే బీఎస్పీ అధ్యక్షురాలైన మాయావతి బర్రెలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాయవతిని మాల్‌వతి అని పేర్కొనాలని.. బర్రెలకు సుగంధ ద్రవ్యాలు పూసినా... దానికి బురదలో దొర్లడం అలవాటని.. మాయవతిది కూడా అదే నైజమని సురేంద్ర సింగ్ పేర్కొన్నారు. బీజేపీ మాయావతికి సంస్కారం నేర్పాలని ప్రవర్తిస్తున్నప్పటికీ.. ఆమె నేర్చుకోవడం లేదని  సింగ్ ఎద్దేవా చేశారు. 2019లో కూడా రాముడు హనుమంతుని సేన సహాయంతో రావణుడిని ఎలా సంహరించాడో.. మోదీ కూడా తప్పకుండా ఆదిత్యనాథ్ వంటి నేతల అండతో బీజేపీ వ్యతిరేక పార్టీలను తుదముట్టిస్తారని పేర్కొన్నారు. సురేంద్ర సింగ్ ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలవడం కొత్తేమీ కాదు. 


గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రతీ హిందువు కనీసం అయిదుగురు సంతానాన్ని కలిగి ఉండాలని ఆయన తెలిపారు. బిడ్డలను పొందడం అనేది భగవంతుని ప్రసాదంగా భావించాలని ఆయన తెలిపారు. ఒకవేళ హిందువులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటూ వెళితే.. కొన్నాళ్లకు భారతదేశంలో వారు మైనారిటీలుగా చెలామణీ అవుతారని తెలిపారు. మైనారిటీలుగా మారాలంటే ఎవరో వచ్చి యుద్ధం చేసి చంపడం కాదని.. కుటుంబ నియంత్రణ వల్లే జనాలు మైనారిటీలుగా మారుతారని సింగ్ పేర్కొన్నారు.