మక్కా మసీదు కేసు పునర్విచారణ జరపాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ
మక్కా మసీదు కేసులో పునర్విచారణ జరపాల్సిందేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎలాగైతే విచారణ చేశారో.. అదే విధంగా ప్రభుత్వం చేత విచారణ చేయించాలని ఆయన అన్నారు.
మక్కా మసీదు కేసులో పునర్విచారణ జరపాల్సిందేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎలాగైతే విచారణ చేశారో.. అదే విధంగా ప్రభుత్వం చేత విచారణ చేయించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్‌తో పాటు ముస్లిం మతపెద్దలు పలువురు గవర్నరుని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ కేసు పునర్విచారణ అనేది అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు.
ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్‌ను జైలులో రోజుకో పోలీస్ అధికారితో విచారణ చేయించారని.. అయితే మక్కా మసీదు కేసులో మాత్రం ఆ విధంగా ఎందుకు జరగలేదని ఒవైసీ ప్రశ్నించారు. అలాగే మక్కా మసీదు కేసులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఏవైనా ముందుకు వస్తే..తాను వారి తరఫున న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. ఎన్‌ఐఏ ఈ విషయంలో మాత్రం పంజరంలో చిలుకలా వ్యవహరించిందని అని ఆయన అన్నారు.
ఇటీవలే ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది వ్యక్తులను నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అలా విడుదలైన వారందరూ కూడా హిందూ సంస్థ అభినవ్ భారత్ సంస్థ సభ్యులే కావడం గమనార్హం.