దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ లాయర్‌గా షర్మిల సత్యశ్రీ
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం లభించింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ హిజ్రాకు బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం లభించింది. తమిళనాడుకు చెందిన షర్మిల సత్యశ్రీ శనివారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో చెన్నైలోని తమిళనాడు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. తమిళనాడు మరియు పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో పేరును చేర్చుకొని.. భారతదేశంలో మొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాది అయ్యానని షర్మిల సత్యశ్రీ ఏఎన్ఐకి చెప్పారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న 11 ఏళ్ల తర్వాత బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం పొందగలిగానని.. జడ్జిగా ఎదగడమే తన కల అని చెప్పారు.
రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఉదయకుమార్.. 18 సంవత్సరాల వయస్సులో సత్యశ్రీ షర్మిగా మారింది. తనను తాను మహిళగా గ్రహించి పురుషులతో ఉండలేక.. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నట్లు షర్మిల తెలిపింది. 2014లో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. హిజ్రాలు సైతం లాయర్లుగా బార్ కౌన్సిల్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో సత్యశ్రీకి బార్ కౌన్సిల్ సభ్యత్వం లభించింది.
రాజస్థాన్ ప్రభుత్వం తొలి ట్రాన్స్‌జెండర్ కానిస్టేబుల్‌ను గత ఏడాదిగా నియమించింది. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మెహతా ఆదేశాల తరువాత గంగా కుమారి మొట్టమొదటి హిజ్రా కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. జలోర్‌కు చెందిన గంగా కుమారి, జలోర్ పోలీస్ సూపరింటెండెంట్.. పరీక్షల్లో పాసైన తరువాత కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది.
మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జొయితా మొండల్, నార్త్ దినాజ్పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్ లోక్ అదాలత్ న్యాయమూర్తిగా నియమితులై.. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తి అయ్యారు.