ఐపీఎల్ బెట్టింగ్ మాఫియా గురించి థానే పోలీసులు సమాచారం సేకరించి.. ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను విచారించిన సంగతి తెలిసింది. అయితే ఈ మాఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఈ మాఫియాకి సంబంధించి రింగ్ లీడర్‌గా వ్యవహరించిన వ్యక్తి ఒకప్పుడు ఆటో స్పేర్ పార్ట్స్ అమ్మే చిన్న డీలర్ మాత్రమేనని.. బెట్టింగ్ దందా మొదలెట్టాక , కోట్లకు పడగలెత్తాడని తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రింగ్ లీడర్ పేరే సోను మలాద్ అలియాస్ సోను జలాన్. ఇతడి ప్రోద్బలంతోనే అనేక మంది సెలబ్రిటీలు, బాలీవుడ్ నటులు ఈ సారి ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ క్రీడలో పాల్గొన్నారని తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కూడా తాను బెట్టింగ్ ఆడినట్లు ఒప్పుకున్నాడు. అయితే బెట్టింగ్‌లో తాను పెట్టిన రూ.2 కోట్లను ఓడినట్లు ఆయన తెలిపారు. 


అయితే ఈ బెట్టింగ్‌కు సంబంధించి జరిగిన విచారణలోనే తాజాగా సోను పేరు బయటపడింది. ఈ బెట్టింగ్ దందా చేయడానికి సోను ఇద్దరు బార్ గర్ల్స్ సహాయం తీసుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే దావుద్ ఇబ్రహీంతో కూడా సోనుకి సంబంధాలు ఉన్నాయని సమాచారం. కేవలం పదవ తరగతి మాత్రమే చదువుకున్న సోను గత 16 సంవత్సరాలుగా బుకీలతో సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా విచారణలో తేలింది.


తనతో దందా చేసే ప్రతీ వ్యక్తితో జరిగిన సంభాషణను రికార్డు చేయడం.. తర్వాత ఆ రికార్డులను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం అనేది సోనుకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా అర్బాజ్ ఖాన్‌ను కూడా ఆయన అలాగే బ్లాక్ మెయిల్ చేశాడట. ప్రస్తుతం ఇంకా ఈ కేసు విచారణలోనే ఉంది.