మేఘాలయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరొందిన సోహన్ డి షిరాను ఈస్ట్ గ్యారో హిల్స్ జిల్లా పోలీసు బలగాలు శనివారం జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టాయి. డోబుకు సమీపంలోని అచక్ పెక్ గ్రామంలో శనివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. గ్యారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జీఎన్ఎల్ఏ) పేరిట ఓ తీవ్రవాద బృందానికి నాయకత్వం వహిస్తున్న సోహన్ డి షిరా గత కొంత కాలంగా అక్కడి ప్రభుత్వానికి ఓ తలనొప్పిగా మారాడు. దీంతో షిరా ఆచూకీ చెప్పిన వారికి మేఘాలయ ప్రభుత్వం గతంలోనే రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించింది. ఇదే ఈస్ట్ గ్యారో హిల్స్ జిల్లాలో ఫిబ్రవరి 18న జరిగిన ఐఈడీ దాడిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జనతొన్ ఎన్ సంగ్మా మృతిచెందారు. జీఎన్ఎల్ఏ అధినేత సోహన్ డి షిరా ఆదేశాల మేరకే ఈ దాడి జరిగి వుంటుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. 


ఎన్సీపీ అభ్యర్థి సంగ్మా హత్య తర్వాత ఎన్నికలకు సిద్ధమవుతున్నఈ ప్రాంతంపై భద్రతా బలగాలు మరింత దృష్టిసారించి సోహన్ డి షిరా ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. డొబు సమీపంలో జీఎన్ఎల్ఏ టెర్రరిస్టుల కదలికలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సోహన్ డి షిరా, భద్రతా బలగాలకు మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో షిరా హతమయ్యాడు.