వలస జీవుల ఆగ్రహ జ్వాల
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు 45 రోజులకు పైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు.
వలస కూలీలకు కోపమొచ్చింది..
సొంతూళ్లకు పంపించాలని డిమాండ్
పోలీసులపై రాళ్ల దాడి
పలు వాహనాలకు నిప్పు
గుజరాత్ సూరత్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితి
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు 45 రోజులకు పైగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు.
చాలా మంది చంటి పిల్లలను ఎత్తుకుని జాతీయ రోడ్లపై వందలాదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్రాల సమన్వయ లోపం, అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం వల్ల వలస కూలీలకు తమ సొంతూళ్లకు వెళ్లే అవకాశం దక్కడం లేదు. దీంతో ఎక్కడికక్కడ వలస జీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు కూడా గుజరాత్‌లోని సూరత్‌లో వలస కూలీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హాజిరా పారిశ్రామిక వాడకు సమీపంలో ఉన్న మోరా గ్రామంలో వలస కార్మికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమను తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫలితంగా వలస కూలీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులపై వారు రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు పోలీసులు దాదాపు 50 మంది వలస కూలీలను అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదు చేశారు.
హాజిరా పారిశ్రామిక వాడలోని మోరా గ్రామంలో చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. అక్కడి పరిశ్రమల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పని చేస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వారికి పనులు లేకుండా పోయాయి. పైగా ఆదాయం లేదు. దీంతో వారు.. తమను తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనంగా బలగాలను దించారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..