మక్కా మసీదు వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం హైదరాబాద్‌లోని మక్కా మసీదు వేదికగా చేసిన పలు వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై అంతర్జాతీయ స్థాయి విచారణ అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటూ ఇటీవల ఐక్య రాజ్య సమితి ఇచ్చిన నివేదికను తీవ్రంగా తప్పుపట్టిన ఓవైసీ.. కాశ్మీర్ సమస్య అనేది భారత్ అంతర్గత విషయమని అభిప్రాయపడ్డారు. 'ఇది మన దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. కేవలం భారత్ అంతర్గత సమస్య మాత్రమే. నేను నా చివరి శ్వాస వరకు ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తానేమో కానీ.. దేశం జోలికి వస్తే మాత్రం తన మద్దతు ఎప్పుడూ ప్రభుత్వానికే ఉంటుంది' అని ఓవైసీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 'ఒక దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఐరాస విభాగానికి లేదు. మానవ హక్కుల సంఘం అనేది ఈ దేశంలో ఓ స్వతంత్ర్య విభాగం. ఈ విషయంలో మేం ప్రభుత్వానికే మద్దతు ఇస్తాం' అని ఓవైసీ తేల్చిచెప్పారు.
ఇదిలాఉంటే, ఓవైపు దేశ అంతర్గత విషయాల జొలికొస్తే, తాము ప్రభుత్వానికే అండగా ఉంటామని ప్రకటించిన ఓవైసీ... మరోవైపు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. 'ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు కాశ్మీర్‌లో ఈ పరిస్థితి నెలకొనడానికి పీడీపీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణం' అని ఓవైసీ స్పష్టంచేశారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడులను నిలువరించటంలో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం చాలా స్పష్టంగా అర్ధమవుతోంది' అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.