ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని హతమారుస్తామని సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. గత వారం హత్యకు గురైన రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారిని బెదిరించిన వ్యక్తుల పేరిటే ఈ సోషల్ మీడియా ఎకౌంట్స్ ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఇటీవల ఐరాస ఓ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కాశ్మీర్ హింస వ్యవహారంలో ఐరాస ఇచ్చిన నివేదికను తీవ్రంగా తప్పుపట్టిన అసదుద్దీన్ ఓవైసీ.. ఐరాసకు ఒక దేశం అంతర్గత విషయాల్లో కలుగుజేసుకునే అధికారం లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడిన ఓవైసీ.. ఈ విషయంలో తాము కేంద్రానికే అండగా నిలుస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. 


అసదుద్దీన్ ఓవైసీకి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు రావడంపై స్పందించిన ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతి సయ్యద్ అబ్దుల్ కషాఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయంపై ట్విట్టర్ ఇండియాకు తాము నోటీసు పంపించామని, తమ పార్టీ అధినేతను బెదిరించిన వారి ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయాల్సిందిగా తాము కోరామని తెలిపారు.