హీరోయిన్స్‌ని ఎన్నికల బరిలోకి దింపుతున్న సీఎం
హీరోయిన్స్‌ని ఎన్నికల బరిలోకి దింపుతున్న సీఎం
కోల్‌కతా: ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే పలువురు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రకటించిన 42 మందిలో ఐదుగురు అక్కడి టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులే. మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్, మూన్ మూన్ సేన్, శతాబ్ధి రాయ్, దేవ్ వంటి వారికి మమతా బెనర్జి టికెట్ కేటాయించారు. జాదవ్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి మిమి చక్రవర్తి, బసిర్‌హట్ నుంచి నుస్రత్ జహాన్, భిర్‌బుమ్ నుంచి శతాబ్ధిరాయ్, ఘటల్ నుంచి ప్రముఖ నటుడు, నిర్మాత అయిన దేవ్(దీపక్ అధికారి) పోటీచేస్తున్నారు.
బెంగాలీ సినీ పరిశ్రమతోపాటే బాలీవుడ్‌లోనూ పేరున్న సినీ నటి మూన్ మూన్ సేన్ అసన్‌సోల్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ ఆమె కేంద్ర సహాయ మంత్రి, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు బాబుల్ సుప్రియోతో ఎన్నికల్లో తలపడనున్నారు. 1984లో సినీ పరిశ్రమకు పరిచయమైన మూన్‌మూన్ సేన్ బెంగాలి, హిందీ, తమిళం, తెలుగు, మళయాళం, మరాఠి, కన్నడ భాషా చిత్రాల్లో నటించారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజకీయ రంగప్రవేశం చేసిన మూన్‌మూన్ సేన్... అదే ఏడాది లోక్ సభ ఎన్నికల బరిలో పోటీచేసి అప్పటికే తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన సీపీఐ(ఎం) నేత వాసుదేవ్ ఆచార్యను ఓడించారు.