బీజేపీపై ద్వారకా పీఠాధిపతి ఆగ్రహం.!
బీజేపీపై ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయిదుగురు ఆధ్యాత్మికవేత్తలకు మినిస్టర్ ర్యాంకు ఇవ్వడం పట్ల ఆయన అభ్యంతరాన్ని తెలిపారు
బీజేపీపై ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయిదుగురు ఆధ్యాత్మికవేత్తలకు మినిస్టర్ ర్యాంకు ఇవ్వడం పట్ల ఆయన అభ్యంతరాన్ని తెలిపారు. "గౌరవప్రదమైన స్థానంలో ఉండి ప్రజలను మంచిదారిలో నడిపించే ఆధ్యాత్మికవేత్తలకు అలాంటి గౌరవం లభిస్తే బాగుంటుంది.
కానీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఎవరూ ముక్కూ, మొహం తెలియనివారిని తీసుకొచ్చి వారికి ఇలాంటి పదవులు ఇవ్వడం శోచనీయం" అని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం బాబా నర్మదానంద్, బాబా హరిహరానంద్, కంప్యూటర్ బాబా, భయ్యూ మహారాజ్ మరియు పండిట్ యోగేంద్ర మహంత్‌లకు క్యాబినెట్ మంత్రుల హోదా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఎప్పుడైతే ఈ హోదా అంశం చర్చకు వచ్చిందో.. కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
"రాజకీయ లబ్ధి పొందేందుకు ఇది వారు చేసే జిమ్మిక్కు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తాను చేసిన పాపాలను ఇలా కడిగేసుకోవాలని భావిస్తున్నారు. నర్మదా నది గురించి ఆయన పట్టించుకోవడం మానేశారు" అని కాంగ్రెస్ నేత పంకజ్ చతుర్వేది తెలిపారు.
మార్చి 31 తేదిన ఈ అయిదుగురు స్వామీజీలను నర్మదా నదీ పరిరక్షణ సమితి అనే కమిటీకి సభ్యులుగా ప్రభుత్వం ప్రకటించింది. నర్మదా నదిని పరిరక్షించే దిశగా ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆ కమిటీ సభ్యులందరికీ క్యాబినెట్ హోదా ఇవ్వాల్సిందిగా సీఎం తెలిపారు. ఏప్రిల్ 3వ తేదిన అధికారికరంగా ఈ ఆర్డర్లు వచ్చాయి