ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ (65) ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం చెన్నైలో డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో డీఎంకే అధ్యక్ష, కోశాధికారి పదవులకు ఎన్నిక జరిగింది. డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే పార్టీ  కోశాధికారిగా దురై మురుగన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు డీఎంకే ప్రధాన కార్యదర్శి  అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 26న డీఎంకే అధ్యక్ష పదవికి స్టాలిన్‌ నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అదే రోజు దురై మురుగన్‌ కూడా కోశాధికారి పదవికి నామినేషన్‌ వేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


49ఏళ్ల పాటు కరుణానిధి డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కరుణ మరణానంతరం అధ్యక్ష పదవికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా 70 ఏళ్ల డీఎంకే చరిత్రలో సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి తర్వాత మూడవ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఎన్నికయ్యారు. గత సంవత్సరం జనవరిలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎంకె స్టాలిన్‌ నియమితులైన సంగతి తెలిసిందే..!


మరోవైపు పార్టీ బహిష్కృత నేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి.. పార్టీ నేతలంతా తనతో ఉన్నారని ప్రకటిస్తూ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. తనను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


అంతకు ముందు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ, తమిళనాడు మాజీ గవర్నర్‌ సుర్జిత్‌ సింగ్‌ బర్నాలా, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫి అన్నన్‌ల మృతికి డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సంతాపం ప్రకటించింది. కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.