మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సేవలు బంద్!
మొబైల్ నంబర్ మార్చకుండా నెట్‌వర్క్ మార్చుకొనేందుకు ఉపయోగపడే మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ఇకపై కష్టంగా మారే అవకాశం ఉంది.
మొబైల్ నంబర్ మార్చకుండా నెట్‌వర్క్ మార్చుకొనేందుకు ఉపయోగపడే మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ఇకపై కష్టంగా మారే అవకాశం ఉంది. దేశంలో ఈ సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలీకం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎమ్ఎన్‌పీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేస్తామని చెబుతున్నాయి. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సేవలు నిలిపివేస్తే... వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం అంత సులువు కాదు. ఒకవేళ గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వం ఎంఎన్‌పీ కంపెనీలను మార్చే అవకాశం ఉందని టెలికాం వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎమ్ఎన్‌పీ ఫీజులను రూ.19 నుంచి రూ.4 వరకు 80 శాతం మేర తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని ఈ రెండు కంపెనీలు టెలికాం శాఖకు రాసిన తాజా లేఖలో పేర్కొన్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. జియో రాకతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడ్డాయి. దీంతో నెలవారీ ఎంఎన్‌పీ రిక్వెస్టుల సంఖ్య మూడు రెట్లకు పెరిగింది. వినియోగదారులను కాపాడుకొనేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలు భారీగా టారిఫ్‌లు తగ్గిస్తున్నాయి.