ఎన్నికల కోడ్: ఎక్కువ మొత్తంలో డబ్బులు వెంట తీసుకెళ్తున్నారా ? జాగ్రత్త !
ఎన్నికల కోడ్: ఎన్ని డబ్బులు వెంట తీసుకెళ్లొచ్చు ?
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వివిధ అవసరాల నిమిత్తం నగదు వెంట తీసుకెళ్లే సాధారణ ప్రజానికం పలు జాగ్రత్తలు పాటించితీరాల్సిందే. లేదంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకతప్పదని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం, ఇతర వస్తుసామాగ్రి పంపిణి చేసి ఓటర్లను మభ్యపెట్టడానికి వీల్లేకుండా తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా రూ. 50 వేలకు మించి నగదు తరలించే వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించే క్రమంలో అది అధికారులకు పట్టుబడినట్టయితే, తప్పనిసరిగా ఆ నగదు మొత్తానికి సంబంధించిన ఆధారాలు సంబంధిత అధికారులకు సమర్పించాల్సిందే. లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించే అధికారం తనిఖీలు చేసే అధికారులకు ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
ఈ నిబంధన కేవలం నగదు తరలింపునకు మాత్రమే వర్తిస్తుందనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో వున్నందున బంగారం, వెండి కొనుగోలు చేసినా, గిరివి పెట్టినవి విడిపించినా.. వాటి రశీదులు వెంట తీసుకెళ్లాల్సి వుంటుంది. ఎవరైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బిల్లు చెల్లించడానికి భారీ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే, సదరు రోగిని ఆస్పత్రిలో చేర్పించిన రశీదులు వెంబడి ఉండాలి.